తేళ్ల లక్షణములు

Posted on March 8th, 2022
Share this post:

తేళ్ల లక్షణములు

తేళ్ల లో పుట్టిన ప్రదేశం మరియు విషం యొక్క తీవ్రతని బట్టి , వాపు , జ్వరం కలుగును. చమట పట్టును . వీటి పొట్ట కింద భాగములో పసుపు , నలుపు , నీలం , పొగ రంగు , గోమూత్రపు రంగు , ఆకుపచ్చ రంగు , తెలుపు రంగు కలిగి ఉండును. పొట్ట కింద మెరియుట , రోమములు కలిగి ఉండును. వీని తోక యందు కణుపులు ఎక్కువుగా ఉండును. మూడు కణుపుల కంటే ఎక్కువ కణుపులు కలిగి ఉండును.

* మధ్య విషం కలిగిన తేళ్ల లక్షణములు -

ఈ జాతిలో 3 రకాల తేళ్లు కలవు. ఇవి ఎక్కువుగా , వాములు , కర్రల గుట్టల యందు ఉండును. విషము కలిగిన ఆయుధములు చే కొట్టబడటం వలన గాని లేక విషజంతువుల చే కరవబడటం వలన గాని చనిపోయిన జంతువుల శరీరముల నుంచి ఇవి పుట్టును . ఇవి కుట్టినచో నాలిక వాయుట , భోజనము చేయలేకపోవుట , మూర్చ కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును. వీటి పొట్ట కింద భాగము నందు పసుపు , నలుపు , ఎరుపు రంగు కలిగి ఉండును. వీని తోక యందు మూడు కణుపులు ఉండును.

* తీవ్ర విషము కలిగిన తేళ్ల లక్షణములు -

ఈ జాతిలో 15 రకాలు ఉండును. ఇవి ఎక్కువుగా చనిపోయిన పాములు మొదలగు విష జంతువుల శరీరములు బాగా కుళ్లిపోయిన తరువాత ఆ శరీర భాగాల నుంచి పుట్టును .

ఈ తేళ్లు కుట్టిన వెంటనే సర్పవిషము వలనే వేగముగా పైకి ఎక్కును . శరీరము నందు బొబ్బలు , జ్వరం కలుగును. అతి నీరసము వచ్చును. ఇంద్రియాల నుండి నల్లని నెత్తురు స్రవించి ప్రాణములు పోవచ్చును.వీటి పొట్ట కింద ఎరుపు , తెలుపు , పొగ రంగు , నీలము , గులాబీ మొదలగు రంగురంగులు కలిగి ఉండును. దీని తోక యందు ఒక కణుపు గాని , రెండు కణుపులు గాని , లేక అసలు కణుపుల లేకుండా గాని ఉండును.

పైన చెప్పినవాటితో పాటు శుశృతుడు వివరించిన రెండు రకాల తేళ్ల గురించి కూడా వివరిస్తాను.

* పత్ర వృశ్చిక లక్షణాలు -

ఇది ఆకువలనే పలచని ఆకారం కలిగి ఉండును. ఇది కుట్టినచో ఆ ప్రదేశము నందు ఎర్రబడి , బొబ్బలు పొక్కి , నిప్పుతో కాల్చినట్లుగా బాధ పెట్టును.

* మండ్రగబ్బ లక్షణములు -

ఇది చూడటానికి తేలు వలే ఉండును కాని పరిమాణంలో పెద్దదిగా ఉండును. ఇవి నలుపు , ఎరుపు రంగులు కలిగి ఉండును. వీటికి విషము నోటి యందు ఉండును. ఇవి కరిచినచో రోగి రోమములు నిక్కబొడుచుకొని ఉండును. శరీరం చల్లబడును చమటలు కారును . పురుషాంగం స్థంభించును. కరిచిన గాయం నుండి నల్లగా రక్తం కారును .

* తేలు యొక్క విషం వ్యాపించు విధం -

తేలు కుట్టిన వెంటనే సూదితో గుచ్చినట్లు ఉండి కొండి యందలి రంధ్రము ద్వారా విషము శరీరంలోనికి ప్రవేశించి ఆ ప్రాంతము అంతా నిప్పుతో కాల్చినట్లు మంట కలుగును. కాళ్ళు , చేతుల యందు కుట్టినచో విషము గజ్జలు , చంకల వరకు వ్యాపించి కొంతసేపు ఉండి మరలా కాటు ప్రదేశమును చేరును . అచ్చట 24 గంటల కాలము పోటు , నొప్పి , పగలగొట్టుచున్నట్లు బాధ కలుగును. దీని విషము పూర్తిగా రక్తములోకి ప్రవేశించక పోయినప్పటికీ తేలు విషము నందు ఆమ్ల ,తీక్ష , ఉష్ణ గుణములు ఉండుటచేత చర్మము కిందనే ఉండి మంట, పోటు కలిగించును.

తేలు కుట్టినప్పుడు చేయవలసిన చికిత్సలు -
* ఎటువంటి తేలు కుట్టినను , మండ్రగబ్బ కరిచినను కుట్టిన ప్రదేశము నందు తడిపి జీలకర్ర , సైన్ధవ లవణం కలిపి నూరి నేతిలో వేయించి దానిని ఒక గుడ్డలో పోసి కుట్టిన ప్రదేశము నందు కాపడం పెట్టి ఆ గుడ్డతోనే కట్టు కట్టవలెను . ఆ తరువాత పసుపు , నీరుల్లిపాయ కలిపి ఆ ప్రదేశము నందు నెమ్మదిగా రుద్దవలెను . ఆ తరువాత తులసి , వెన్న , గోమూత్రము కలిపి నూరి కుట్టినచోట లేపనం చేయవలెను .

* కప్పు వేడినీటిలో చెంచాడు ఉప్పు కలిపి తాగితే బాధ త్వరగా తగ్గును.

* గచ్చకాయ పగలగొట్టి దానిలోని పప్పును రెండు నీటిచుక్కలు వేసి అరగదీసి ఆ గంధాన్ని కుట్టినచోట రాసి నిప్పు వేడి చూపిస్తే విషాన్ని లాగివేస్తుంది. ఇదేవిధంగా కుంకుడుకాయ పై గుజ్జు గంధాన్ని వ్రాసి సెగ చూపించినా బాధ పోవును .

* ఎండిపోయిన గుమ్మడికాయ ముచ్చిక నీటితో అరగదీసి కుట్టినచోట రాయుచున్న బాధ తగ్గును. వసకొమ్మును అరగదీసి రాయుచున్న కూడా పనిచేయును .

* గుగ్గిలం పొడి కుట్టినచోట పెట్టి నిప్పువేడి చూపించుతున్న విషాన్ని లాగివేయును.

* తేలు కుట్టిన వెంటనే ఉత్తరేణి ఆకులను నలిపి కుట్టిన ప్రదేశములో రుద్దిన విషం విరుగుతుంది.

* జీలకర్రను నూరి కుట్టినచోట అంటించి నిప్పు వేడి చూపించుతున్న విషాన్ని బయటకి లాగును .

* పసుపును చిక్కగా నీటితో కలిపి కుట్టినచోట పెట్టి సెగ చూపించుతున్న అది ఆరుతున్న కొద్ది బాధ తగ్గును.

* రుద్రజడ ఆకులు నలిపి కుట్టినచోట రుద్దితే విషం తగ్గుతుంది . కుట్టిన వెంటనే నిప్పుని కుట్టినచోట నొక్కిపెట్టి వెంటనే తీసివేసిన బాధ వెంటనే తగ్గును. దీనికి కారణం నిప్పు తడిని అతివేగముగా లాక్కుంటుంది. తేలు విషం కూడా అతిస్వల్ప తడి ద్రవం.

* నేపాళం గింజలొని పప్పు జిల్లేడు పాలతో కలిపి నూరి కుట్టినచోట అంటించుతున్న విషాన్ని గుంజివేయును .

ఇప్పుడు మీకు తేలు కుట్టినప్పుడు ఏయే లక్షణాలు కనిపిస్తే రోగి మరణించునో తెలియచేస్తాను.

కన్నులు , ముక్కు, నాలుక ఇవి వాని యొక్క సహజ గుణములు పొగొట్టుకొని విపరీత గుణములు అనగా కన్నులు సరిగ్గా చూడలేకపోవుట , ముక్కు వాసనని గుర్తించలేకపోవుట , నాలిక రుచిని గ్రహించకపోవుట , శరీరము నందు కాలినట్లు బొబ్బలు , వాపు కలుగుట , నొప్పి , జ్వరం , వాంతి కలిగి గాయము నందలి మాంసము ఊడిపడిపోవుట వంటి లక్షణాలు తేలు కుట్టిన రోగికి కలిగినచో ఆ రోగికి చికిత్స చేసినను బ్రతకడు . ఈ లక్షణాలు చికిత్స సమయానికి అందకుండా ఆలస్యం అవుతున్నకొలది మొదలై చివరకు ప్రాణాలు హరించును .




Category:
Telugu

Posted on:
March 8th, 2022