పరమేశ్వరుని లీలలు.
చోళులు రాజ్యమేలుతున్న రోజులవి. తమిళనాడు రాష్ట్రంలో సత్త మంగై అనే ఊళ్లో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తుండేవి. ఆ ఊళ్లోని మఠాలలో పండితులు ప్రతి రోజూ వేదగానం చేసేవారు. మైనాజాతి పక్షులు ఆ వేద ఋక్కులను తియ్యని గొంతుతో అనుకరిస్తూ పాడేవీ
స్త్రీలు లావణ్యాన్ని ఒలకబోస్తూ చెరువులలో దిగి స్నానాలు చేసేవారు. హంసలు ఒకదానితో మరొకటి పోటీపడి చెరువులో దూకి, ఆ సౌందర్యవతులతో ఆటలు ఆడేవి. ఈ ఊళ్లోని పురుషులు ఎంత పవిత్రమూర్తులో, వారి భార్యలు అంత పుణ్యవతులు.
అదే ఊరిలో తిరునీలనక్కర్ అనే శివభక్తుడు ఉండేవాడు. వేదవిహిత కర్మలు తూ.చ తప్పకుండా ఆచరించేవాడు. ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి గృహిణిగా తన ధర్మాలు పాటించే ప్రేమైకమూర్తి అయిన భార్యతో పాటు, పూజాదికాలను భక్తిశ్రద్ధలతో నిర్వర్తించేవాడు.
ఒక రోజు నీలనక్కర్ ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించాడు. అతనివెంట అతని భార్య కూడా వివిధ రంగులతో శోభించే పుష్పాలతో, బిల్వదళాలతో అనుసరించింది. వినిర్మల భక్తితో పరవశించే హృదయంతో అతను శివుని కీర్తిస్తూ మంత్రాలు పఠించేవాడు. ఆ తర్వాత ప్రగాఢమైన ధ్యానంలో మునిగిపోయాదు.
అతని భార్య ఒక్కొక్కటిగా బిల్వదళాలను శివలింగంపై వేస్తూ అర్చించసాగింది. ఆమె కన్నులు తదేకదృష్టితో శివలింగంవైపే చూస్తున్నాయి. అంతలో విషపూరితమైన ఒక సాలెపురుగు లింగంపై గాలిలో తిరుగాడుతుండటం ఆమె కంటపడింది. ఆమె దానిని తొలగించాలని అనుకుంటుండగానే అది కాస్తా లింగంపై వాలింది
ఒక విషకీటకం లింగంపై పడడం చూడలేక ఆమె తన శక్తినంతా కూడదీసుకుని దానిపైకి ఊదింది. ఆ గాలికి సాలీడు, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాని అనుకోకుండా ఆమె నోటివెంట లాలాజలపు తుంపరులు ఆ లింగంపై పడ్డాయి. (ఇదే వేరే చోట ఇలా వ్రాశారు...శివుని శరీరం పైన సాలీడు పాకిన చోట దద్దురు వస్తుందని తాను కావాలనే ఉమ్మి వ్రాస్తుంది... )
అదే క్షణంలో ఆమె భర్త కన్నులు తెరిచాడు. అతడు సాలీడును గమనించకుండా తన భార్య చేసిన పనికి కోపోద్రిక్తుడైనాడు.
కళ్లవెంట నిప్పులు కురిపిస్తూ.. అతడు శివుపై ఎందుకు ఉమ్మివేశావు? అని నిలదీశాడు. లేదు నేనెందుకు ఉమ్మివేస్తాను? శివలింగంపై వాలిన సాలీడును ఊది తొలగించాను అంతే నాకీ అనుకోకుండా ఉమ్మి తుంపరులు లింగంపై పడ్డాయి. అంది భయంతో వణికిపోతూ..
ఈ శివలింగాన్ని నువ్వు అపవిత్రం చేశావు. మరోవిధంగా సాలీడును అక్కడి నుంచి తొలగించి వుండాల్సింది. శివునికే అపచారం చేసిన పాపాత్మురాలివి. నీకు నా హృదయంలోనూ, నా ఇంటిలోనూ స్థానం లేదు.
ఇక్కడి నుంచి నుంచి వెళ్ళిపో.. అని పెద్దగా అరుస్తూ ఆ ఆలయాన్ని విడిచివెళ్లాడు. ఆమె దుఃఖిస్తూ ప్రాధేయపడింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎక్కడకు వెళ్లాలో తెలియక, ఆ ఆలయంలోనే ఆ రాత్రి గడపాలని నిశ్చయించుకుంది. తనను కాపాడమని ఆమె శివుణ్ణి వేడుకుంది. ఆ విధంగా విడిపోయిన దంపతులను చూసి శివుని హృదయం కరిగిపోయింది.
తనపట్ల వారికిగల ప్రేమకు, భక్తికి ఆయన ఎంతగానో పులకించి, వారిని తిరిగి ఒక్కటి చేయాలని తలచాడు. అర్థరాత్రి అయ్యింది. తిరునీలనక్కర్‌కు ఆ రాత్రి కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. నా శరీరాన్ని సరిగ్గా చూడు నీ భార్య సరైన సమయంలో నాకు సహాయమే చేసింది అన్నాడు శివుడు. అతను తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.
తన భార్య గాలి ఊదినచోట తప్పించి, శివుని శరీరంలో మిగిలిన భాగం అంతా బొబ్బలతో, గాయాలతో కనిపించింది. ఉలిక్కిపడి అతను నిద్రలేచాడు. ఎంతటి కఠినత్ముణ్ణి నేను.. శివునిపై ప్రేమతో తన భార్య ఈ పని చేసిందని, అటువంటి ప్రేమను తాను గుర్తించలేకపోయానని తనను తాను తిట్టుకుంటూ ఆలయంలోకి పరుగు తీశాడు.
అక్కడ అతని భార్య తన విధిని తలుచుకుని శోకిస్తూ ఉంది. ఇంతటి భక్తురాలి పట్ల ఎంతటి నిర్దయతో ప్రవర్తించాననుకుంటూ పరమశివుడు నాకళ్లు తెరిపించాడు. నాతో పాటు ఇంటికి రా. మనం ఇకనుండి ఎటువంటి కలతలు లేకుండా సుఖంగా జీవిద్దాం అన్నాడు. ఇలా విడిపోయిన దంపతులను ఆ పరమశివుడు కలిపాడు.
టైప్ రత్నప్రసాద్
Source: Whatsapp
Category:
Telugu
Posted on:
November 13th, 2020