శ్రీ మహా విష్ణువు

Posted on April 11th, 2023
Share this post:

శ్రీ మహా విష్ణువు

ప్రశ్న ప్రారంభంలో విష్ణుమూర్తినికి మహా అనేటువంటి విశేషణాన్ని వాడారు. అలాగే శ్రీ అనేటువంటి గౌరవ వాచకంతో ప్రారంభించారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

నిర్గుణము నిరాకారము అయినటువంటి పరబ్రహ్మ సృష్టి చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు - ఆయన పరమేశ్వరుడయ్యాడు; శివుడు అనబడ్డాడు: నారాయణుడు అనబడ్డాడు, కామేశ్వరుడయ్యాడు.

ఆ పరమేశ్వరుడు యొక్క సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి శక్తిని పరమేశ్వరి అన్నారు; ఆవిడే శివాని, ఆవిడే ఆదిలక్ష్మి, చివరగా ఆవిడే కామేశ్వరి.

ఆధ్యాత్మికంగా సృష్టిక్రమాన్ని కనుక గమనించినట్లయితే, పైన చెప్పబడినటువంటి అమ్మవారు - కామేశ్వరి లేదా రాజరాజేశ్వరి లేదా లలితా దేవి నుండి త్రిగుణాలు - మూడు గుణములు - సత్వ రజో తమో గుణములు ఉద్భవించాయట. ఆ మూడు గుణముల నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించారు. వారికి తోడుగా శక్తి అంశ గా సరస్వతి దేవిని, లక్ష్మీదేవిని, పార్వతి దేవిని అమ్మవారు సృష్టించారు.

ఫిజిక్స్ లో Einstein స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటెవిటీ లో భాగంగా స్పేస్ అండ్ టైం గురించి వివరించారు. స్థూలంగా చెప్పాలంటే స్థలము కాలము అన్నమాట. కాలం అనంతం. స్థలము అన్నది వచ్చిన తర్వాతే కాల ప్రవాహానికి ఒక కొలబద్ద ఏర్పడుతుంది.

త్రిమూర్తులలో విష్ణుమూర్తి స్థితికారకుడు. అంటే పరిపాలకుడు. మరి పరిపాలన చేయాలి అంటే రాజ్యం ఉండాలి కదా. సృష్టి జరిగిన తర్వాత మాత్రమే పరిపాలన.

అనంత కాల ప్రవాహంలో - యుగాలు, కల్పాలు ఇత్యాది కాల గణన - సృష్టి ప్రారంభం అయిన తరువాత మాత్రమే జరుగుతుంది. అంటే అనంత కాల ప్రవాహంలో - సృష్టి, దాని పరిపాలన ఒక చిన్ని అంశము మాత్రమే. కాలాన్ని ఆశ్రయించుకుని యీ సృష్టి మరియు పరిపాలన ఉంటాయి.

సంప్రదాయకంగా నాగము లేదా సర్పాన్ని అనంతకాల ప్రవాహానికి గుర్తుగా ఆధ్యాత్మిక పరిభాషలో వాడుతూ ఉంటారు.

జాతకాల్లో నాగ శాపం అన్నమాట వింటూ ఉంటాము. చాలామంది చెప్పే మాట ఏదో ఒక జన్మలో పామును చంపారు అందుకే ఈ ఈ నాగ శాపం అని. పామును చంపితే మాత్రమే పాపమా? మిగతా జంతువుల్ని లేదా మనుషుల్ని చంపితే అవి జాతకాల్లో కనబడవా?

పైన చెప్పుకున్నట్లుగా నాగశబ్దము కాలానికి గుర్తు. గత జన్మలో చేసినటువంటి పాపాలను - ఈ జన్మలో అనుభవించడాన్ని కనుక జాతకంలో చూడగలిగితే దానిని నాగ శాపం అంటారు.

పట్టుపీతాంబరాలు ధరించినవాడు, ఐశ్వర్య లక్ష్మి ని పక్కనే ఉంచుకున్న వాడు, అయినటువంటి విష్ణుమూర్తికి- విశ్వమంతా తానే అయినటువంటి విష్ణుమూర్తికి పడుకోవడానికి మంచి పానుపే దొరకలేదా? ఆయన వైకుంఠంలో చుట్టలు చుట్టలుగా చుట్టుకుని ఉన్నటువంటి ఆదిశేషువుపై పడుకున్నట్టుగా చిత్రకారులు చిత్రీకరిస్తూ ఉంటారు.

కుండలినీ అన్న మాట విన్నారు కదా. యోగ సాధన మార్గంలో కుండలిని విద్య ఒకటి. మనుషులో ఉన్నటువంటి అనంతమైన చైతన్యం నిద్రావస్థలో ఉంటుందట. అది పాములాగా మూడున్నర చుట్టలు చుట్టుకుని ఉంటుందని యోగ శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు.

సడ్చక్రాలు అన్న మాట విన్నారు కదా. మూలాధార చక్రం ఒక పద్మంలా ఉంటుంది. ఆ పద్మంలో ఒక శూన్య త్రికోణం ఉంటుంది. అక్కడే కుండలిని ఒక పాములాగా మూడున్నర చుట్లు చుట్టుకొని అదృశ్యంగా నిద్రిస్తుంది.

మూడున్నర చుట్లు ఎందుకంటే– ఇప్పటివరకు జరిగిన సృష్టి పరిణామంలో- ఖనిజ దశ, వృక్ష దశ, జంతు దశ అనే మూడు దశలు పూర్తయ్యాయి. నాల్గవ దశ మానవ దశ. ఇది సగమే పూర్తయింది. అందుకే మూడున్నర చుట్టలు చుట్టుకొని ఉంది.పరిపూర్ణ మానవుడు తయారైతే అది నాలుగు చుట్లు చుట్టుకొని ఉంటుందని కొందరి అభిప్రాయం. వెన్నెముకను చాలామంది వెన్నుపాము అంటారు!

పాము జీవిలో ఉన్నటువంటి కుండలినీ శక్తికి ప్రతీక. పాము అనంత కాల ప్రవాహానికి ప్రతీక. స్థితి కారకుడైన విష్ణు మూర్తి - కాలాన్ని ఆశ్రయించుకొని పరిపాలన సాగిస్తాడు. కుండలినీ శక్తిని జాగృతం చేసేవాడు విష్ణుమూర్తి. అందుకు ప్రతీకగా ఆయన మూడున్నర చుట్టులు చుట్టుకుని ఉన్నటువంటి పాము మీద పడుకుని ఉంటాడు.


ఈ బొమ్మలలో గమనించండి. విష్ణుమూర్తి కి ఆసనమైన పాము - మూడున్నర చుట్టులు చుట్టుకుని ఉంది.

అలాగే పడుకుని ఉండడం. అది యోగ నిద్రకు గుర్తు. తురీయావస్థకు, సమాధి స్థితికి చిహ్నం.

మీ ప్రశ్నకు సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే - జీవిలో ఉన్న అనంత చైతన్యానికి గుర్తు పాము. తురీయావస్థ కు గుర్తు ఆ నిద్ర. యోగ నిద్ర. అంటే - అది ఒక యోగ చిహ్నం. అత్యున్నతమైనటువంటి యోగ స్థితికి ప్రతీక.

Category:
Telugu

Posted on:
April 11th, 2023