Midhunam - Gemini
సినిమా అనేది ఎక్కడన్నా కూడా మొదటి సీన్ నుంచి మొదలుపెడతారు .. కానీ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే క్లైమాక్స్ తో మొదలుపెట్టాలి ...
"లక్క బంగారం లా కలిసిపోయాము .. బంగారం హరించింది .. లక్క మిగిలింది !!
ఈ ఒక్క డైలాగ్ విన్నాక నాకు తేరుకోడానికి ఒక రోజు పట్టింది .. ఒక అందమైన కథను ఎంతో చక్కగా తెరకెక్కించిన తనికెళ్ళ భరణి గారు నిజంగా గొప్పవారు ..
కొన్ని సినిమాలు అనేవి మన ఈలలు ,చప్పట్లు వరకే పరిమితం అవుతాయి .. కానీ కొన్ని సినిమాలు మటుకు మన గుండెని తాకి మన కళ్ళను తడి చేస్తాయి .. మిథునం నిజంగా అలాంటి సినిమా నే ..
మిథునం అనేది మన తల్లి తండ్రుల, అమ్మమ్మ తాతయ్యల కథే .. జీవితంలో అన్ని బాధ్యతలు నిర్వహించి .. చివరకు హాయిగా సుఖ పడాల్సిన సమయం వచ్చేసరికి ... పిల్లలు వారి జీవితాలు వారు చూసుకోవాల్సి పరిస్థితి వచ్చినప్పుడు .. ఆ తల్లి తండ్రులు వారి జీవితాలను దిగులుగా కాకుండా కొత్తకొత్త గా ఎలా ఆవిష్కరించుకోవచ్చు వారు చూపిస్తారు ..
రిటైర్ అవ్వడం అంటే మనము రోజు చేసే పని మానేసి ఏదన్నా కొత్త పని చేయడమే కానీ .. అసలు పని చేయడమే మానెయ్యడం కాదు .. అని ఒక సీన్ లో అప్పదాసు అంటాడు .. నాకు అది చాలాబాగా నచ్చింది …
బాల సుబ్రహ్మణ్యం గారు కానీ లక్ష్మి గారు కానీ .. నటి నటుల్లా కాకుండా వారి వారి పాత్రల్లో జీవించారు .. చివరి ఘట్టం లో ఉన్న ఆ ముసలి వారు .. జీవితంలో మన నుంచి ఏమి ఆశించరు .. కేవలం ప్రేమ ఆప్యాయతలు తప్ప .. మనము వచ్చి వెళ్ళే ఒక 4 రోజుల కోసం వారు సంవత్సరం అంత ఎదురు చూస్తూ ఉంటారు .. నాకు నిజంగా మా అమ్మమ్మను గుర్తు చేసింది .. ఆవిడ కూడా మనవాళ్ళు మనవరాలు వస్తారు అని , వచ్చి ఒక నాలుగు రోజులు ఉంటారని ఒక సంవత్సరం మొత్తం ఎదురు చూసేది ..
వారికున్న చిన్న ప్రపంచంలో ఒక దూడ చనిపోయింది అని తెలిసినప్పుడు పూర్తిగా చలించిపోతారు .. దాని నుంచి తేరుకోడానికి వారికి టైం పడుతుంది .. పైకి గంబిరంగా ఉన్న కూడా వారి మనసు చాలా సున్నితంగా ఉంది అని దీని నుంచి తెలుస్తుంది ..
చాలా మంది భార్యలు భర్తల తిండి పుష్టి చూసి అపుడప్పుడు విసుకుంటూ ఉంటారు .. " ఈయనకు చేయలేక చస్తున్నాను " అని .. అట్లా అనుకుంటూనే మళ్ళీ అన్ని పనులు చక్కపెడుతూ ఉంటారు .. భర్తలు ఒక్క పూట సరిగ్గా తినయకపోయిన కూడా విలవిలలాడిపోతారు .. వారు కడుపునిండా తింటేనే కానీ భార్యలకు తృప్తిగా ఉంటుంది .. ఆ పాయింట్ ని దర్శకుడూ చాలా బాగా చూపించాడు ..
ఒక్కోసారి వయసుమళ్ళిన భర్తలు చేసే పనులు భార్యల ప్రాణాలు తోడేస్తాయి .. ఈయన చాదస్తానికి నేను బలి అవుతున్న అని తిట్టుకుంటూ ఉంటారు .. వయసు, చాదస్తం అనేవి రెండు జంటగా వస్తాయ్ అనుకుంటాను .. చాలా మంది పెద్ద వయసు ఉన్న వారి నుంచి ఈ కంప్లైంట్ విన్నాను .. ఈ పాయింట్ కూడా అద్భుతంగా చూపించారు ..
ఇంత ఆప్యాయంగా ఉన్న జంట మధ్య కూడా గిల్లికజ్జాలు అనేవి చాలా మాములు విషయము .. ఏదన్నా గొడవ జరిగితే కూడా ప్రేమ లాగానే అంతే సీరియస్ గా జరుగుతుంది అని ఈ సీన్ చెప్తుంది ..
బుజ్జి సరిగ్గా ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉన్న అప్పదాసు .. తను జ్వరాన పడేసరికి పూర్తిగా ధైర్యం కోలుపోతాడు .. … భార్య భర్తల అనుబంధాన్ని ఇక్కడ చాలా బాగా చూపించాడు దర్శకుడు ..
ఇంక తను వెళ్లిపోతుందేమో అని అనుకుంటాడు… తన చేత లక్షావోత్తుల నోము చేయిస్తాడు … అట్లా చేయిస్తునంత సేపు .. అప్పదాసు కళ్ళలో తన భార్య చనిపోబోతున్నది అన్న బాధ తెలుస్తూ ఉంటుంది ..
ఆ సంబంధం చేసుకొని ఉంటె బాగుండేది అన్న మాట .. చాలా జంటల మధ్యన వస్తూ ఉంటుంది .. ద్రాక్షారామం సంబంధం చేసుకొని ఉంటె అన్న మాట వినంగానే అప్పదాసుకు ఒళ్ళు మండిపోతుంది ... చివరకు ద్రాక్షారామం సంబంధం లేదట అని తెలియగానే అప్పదాసు ఆనందం ఒక చిన్నపిల్లాడి సంతోషం లాగ ఉంటుంది …
ఈ సినిమా చూసి బాధ పడని వారు ఉండరు అని నేను అనుకుంటున్నాను .. చిన్ని చిన్ని భావాలను చాలా బాగా చూపించిన చిత్రం మిథునం ..
ఇది రాసేటప్పుడు కూడా నేను తిరిగి ఒక సారి సినిమా చూడాల్సి వచ్చింది .. ఈ సినిమా చూసినప్పుడు మొదటి రోజు కలిగిన బాధ .. ఈ రోజు కూడా కలిగింది ..
-- నిశ్చలవిక్రమ
Category:
Movies
Posted on:
April 14th, 2023