తెలుగులో 'ழ'(zha) కి దీటైన పదం లేదా? 'ఱ'కి, 'ழ'కు ఏమైనా సంబంధం కలదా?

Posted on July 22nd, 2023
Share this post:

తెలుగులో 'ழ'(zha) కి దీటైన పదం లేదా? 'ఱ'కి, 'ழ'కు ఏమైనా సంబంధం కలదా?

దీటైన పదమా లేక దీటైన శబ్దమా ?.

"zha" కి దీటైన శబ్దం కాదు, సరాసరి అదే శబ్దం మన తెలుగు భాషలో కూడా ఉండెడిది - ఒకప్పుడు".

జి.పరబ్రహ్మశాస్త్రి గారు తమ "తెలుగు శాసనాలు" లో "zha" శబ్దం గురించి ఈ క్రింది విధముగా వ్రాశారు : -

"సుమారు క్రీస్తు పదవశతాబ్ద్యంతము వఱకు అనగా నన్నయ భట్టారకుడు గ్రాంథికభాషను శాషించువఱకు శాసనములందు 'ఴ (zha)' అనురూపమున వ్రాయబడు అక్షరముండెడిది.ఇది బండి 'ఱ' లోని అడ్డుగీటును తొలగించి వ్రాసినట్లు శాసనములందు కనుపించును. దీనిని గూర్చి కీర్తిశేషులు జయంతి రామయ్య పంతులుగారు,వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు మున్నగు పలువురు పరిశోధనలు జరిపి అది మనకిప్పుడు వాడుకలో లేని వేరొక అక్షరమని నిర్దారణము గావించిరి. అదిక్రమముగా కొన్నిచోట్ల 'డ' గాను,కొన్ని చోట్ల 'ళ' గాను,మరికొన్ని చోట్ల 'ద' గాను మార్పునొంది అదృశ్యమైనట్లు చెప్పిరి.ఈ సందర్భమున వారి అభిప్రాయ భేదములెట్లున్నను ఈయక్షరమొకటి పూర్వము తెలుగు భాషలో గలదని నిశ్చయముగ శాసనములనుబట్టి తెలియుచున్నది.అది 'చోఴ' పదములలో 'చోడ' లేక 'చోళ' అనియు; 'నోఴoబ' పదములో 'నోళంబ' అనియు, 'ఴెoదలూరు' అనుచోట 'దెందులూరు' గాను, 'క్ఴింద' అనునది 'క్రిన్ద(క్రింద)' గాను 'క్ఴొచ్చె' అనుపదము 'క్రొచ్చె' గాను పరిణమించినది. ​కన్నడములోకూడ చాల కాలముముండినట్లు నిఘంటువులందిదిగల పదములనేకములు చేర్చబడి యుండుట వలన తెలియుచున్నది. తమిళమునందిది 'వాఴైపఴమ్'(=అరటిపండు) వంటి పదము లలో వాడబడుచున్నదని కొందరు భావించెదరు.తెలుగు శాసనములలో చోఴ అని వ్రాయ బడిన కాలమునకు చెందిన పుణ్యకుమారుని చోళకేరళానామధిపతిః' అని 'ళ' కారము వ్రాయబడింది. కనుక '' అనేది తెలుగు భాషకి చెందిన అక్షరమే; సంస్కృతములో 'ళ'గనో 'డ'గనో మారుచుండెడిది."

ఇంకొక ఉదాహరణ : "పొఴుఁదు --> ప్ఴొన్దు --> ప్రొద్దు --> పొద్దు "

కావున "zha" అనునది తెలుగు శబ్దమూ మరియు అక్షరం కూడా. ఇది ద్రావిడ భాషలన్నింటికి చెందిన శబ్దం. ప్రత్యేకించి దీనికి దీటైన శబ్దం మన తెలుగులో మరొకటి ఉండనవసరం లేదు.

తెలుగులో దాని లిపిగుర్తు - "ఴ". ఇది చూడడానికి కొంచెం బండిరాకి(ఱ) దగ్గరగా ఉంటుంది కానీ రెంటిని వేరు వేరుగా పలకాలి.

బండిరాని మరాడించినట్టు "ర్ ర్ ర్ +అ" అని పలకాలి. like బఱ్ఱె, గొఱ్ఱె, పుఱ్ఱె, మఱ్ఱి, కఱ్ఱ, …మొll.

ఇక "ఴ" ని , "ళ" పలుకుతున్నట్టే పలకాలి. కానీ ఈసారి నాలుకని వెనక్కి మడుస్తూ అంగిలికి తగలకుండా పలకాలి. ఈ క్రింది బొమ్మను ఒకసారి గమనించండి.

మొదటిది మామూలు "" - నాలుక కొనభాగంతో పై పల్లవరస మీది అంగిలిని తాకుతుంది.

రెండవది "" - నాలుక సగం మడతబడి పై అంగిలిని తాకుతుంది.

మూడవది "" - అచ్చం "ళ" లాగే, కానీ ఈసారి నాలుక అంగిలిని తాకదు.

చివరగా :

  • "ఴ" యేమో "ల"- వర్గానికి చెందిన శబ్దం.
  • "ఱ" యేమో "ర"- వర్గానికి చెందిన శబ్దం

గమనిక :

కొందరికి ఈ "zha" యొక్క తెలుగు రూపం డబ్బాల రూపంలో కనిపించవచ్చు. కొన్ని ఫోన్లు ఈ "zha" శబ్దం యొక్క తెలుగురూపాన్ని సపోర్ట్ చేయకపోవడమే దీనికి కారణం. నేను మాత్రం ఈ అక్షరం యొక్క తెలుగు రూపాన్ని నేరుగా టైప్ చేయడం జరిగింది. ఆ కొందరి కోసం క్రింద ఒక screenshot పెడుతున్నాను గమనించగలరు.

ఈ లిపిగుర్తును సపోర్ట్ చేసే కీబోడ్ నాకు తెలిసినంత వరకు లేదు. కాబట్టి website ల మీద ఆధారపడటమే. క్రింద ఇచ్చిన లంకెను చూడగలరు.

Aksharamukha
This is your fallback content in case JavaScript fails to load.

ఇందులో "zha" అని ఆంగ్లంలో టైప్ చేస్తే అదే తెలుగులోకి transliterate చేస్తుంది. ఆ శబ్దం యొక్క గుణింతాలకి అలాగే ఒత్తులకి కూడా సపోట్ ఉంది. పదాన్ని నేరుగా టైప్ చేసి copy paste or cut paste కొట్టడమే.





Category:
Telugu

Posted on:
July 22nd, 2023