నెల్లూరి నెరజాణలు అంటే ఎవరు? ఈ పదం వెనుక చరిత్ర ఏమిటి?
నెత్తి గొరిగి పంపు నెల్లూరి నెరజాణ —-అనే పద్యపాదం ప్రసిద్ధం.
వేటపాళెం(ఒంగోలు జిల్లా) లైబ్రరీలో 1940 ప్రాంతాల్లో ప్రింటయిన చిన్న 30 పేజీలపుస్తకం 1976(?) లో చూచాను. ఇంకా అది అక్కడ ఉండవచ్చు. —అందులో ఈ క్షురకర్మ ప్రసక్తిలేదు… నెల్లూరు పల్లె పడుచుల మాటలనేర్పు, వ్యాపారంలో కౌశలం ,ఇలాంటివేవో స్త్రీ పరంగానే ఉన్నట్టు గుర్తు.
నెల్లూరులో సంతపేట ఈ నాటికీ ఒక పెద్ద వ్యాపార కేంద్రం.
ఆ పరిసరాలలో పాత కాలంలో ఎప్పుడో వ్యభిచారం జరిగేదని దానిమీద నెల్లూరు నెరజాణ అనే మాట వచ్చింది అని కొందరంటారు.
ఇప్పటికీ కొత్త వాళ్లు ఇక్కడి వాళ్ళతో కలిసి వ్యాపారం చేయడం అంత తేలిక కాదని , ముంచుతారని ఇతర జిల్లాల మిత్రుల అనుభవం.
అంత కాక పోయినా , వీళ్లు వెర్రి బాగులవాళ్లు మాత్రం కాదు —అనేది నిజం.
ఇక్కడి వాళ్ళు వాగుడుగాయలు కాదు.
అల్పాక్షరంబుల అనల్పార్థ స్ఫురణ చేయగలవాళ్ళే.!
కొంచెం లోతు మనుషులే గానీ- -తడిగుడ్డతో గొంతు కోసే వాళ్లూ, తలకాయలు మార్చే వాళ్లూ కాదు.
వీళ్ళను ఏమార్చడం కష్టం . అంతే.!
జాణ అంటే నేర్పరి .ఇది కేవలం స్త్రీ పరంకాదు .
జాణ-.. -జాణెత ఉన్నాయి గదా!
*జాను తెనుగు * లో ఉన్న పదమే ఇది . ముచ్చటగా ఉండే...అనీ అనుకోవచ్చు.
నెఱ—, నెర - ఈ రెండు రేఫలకూ ఇప్పటి వాడుకలో తేడా లేదు. ఒకటే అనుకుందాం.
నేర్పు , నేర్పరి , నెరవేరడం—--వీటిల్లో కనబడుతున్న రూపమే ఇది.
చిన్నయసూరి నెర + నడుము = నెన్నడుము అని
అన్యంబులకు సహితమిక్కార్యంబు కొండొకచో గానంబడియెడి అనే సూత్రం కింద ఉదహరించాడు.
నిండు మనసు అనే అర్థంలో నెర+మనము అని విభజించవచ్చు గానీ ,
నడుము కెట్ల బాగుంటుంది? నడుము ఈ కాలంలో ఒబేసిటీ వల్ల నిండుగా కనిపిస్తున్నదంటే తప్పదు గానీ .....మన కవులు ఒప్పుకోరు గాక ఒప్పుకోరే.!
అరుదుగ పిడికిట నణగెడు నడుముల్—-హస్తి సమానపు యానములున్... అని పింగళి సూరన్న.
అస్తి నాస్తి విచికిత్సాహేతు శాతోదరిన్.— అని శ్రీ నాథుడూ..
నాతులను అతిగా అత్యంత రమణీయంగా భావాంబర వీధిలో దర్శించుకొని పులకరింతలు పొందగా, మరొక
నాక భామిని —తన కౌనునెట్లనో(లేనిదాన్ని) బిగగట్టుకొని
నడుము ఏమాత్రమూ కనబడని ముగ్ధ మనోహరుణ్ణి చూచి
*కౌను గానరాదమ్మక చెల్ల*... అని చొట్ట బుగ్గలు నొక్కు కొన్నది (ఎవరు ? వరూధినమ్మ)
ఇంత కథ ఉంటే -- నడుము నిండుగా ఉందంటే ఎవడొప్పుకుంటాడు? అందులోనూ బహుజనపల్లి (సీతారామాచార్యులు)వారు అసలు ఒప్పుకోలేక — బహువిధాల ఆలోచించి , గురువునైనా ధిక్కరించి , ఒక నిర్ధారణ చేసేసే వరకు కునుకు తీయలేదు.
నెన్నడాదులన్ నెఱి తగు.. అని నిర్ధారణ చేసి(ప్రౌఢ వ్యా.),
ఊపిరి పీల్చుకొన్నాడు. నెఱి రమ్యార్థకము అని లేని నడుమును రమ్యంగా దర్శించు కొన్నాడు.
మా నెల్లూరి నెరజాణ — నెరి జాణే.
1. నీవు నీ సుతుండు నెరి లేక తప్పిన...అంటాడు విదురుడు ధృతరాష్టుడితో......నీతి లేకుండా తప్పుదారిలో పోతే..అనే అర్థంలో..
2 . నెమ్మదిగా నడువు.. .అంటే' ---' స్లో ''గా పో....అని బాగా వాడుకలో ఉన్న మాట. (నెల్లూరు లో)
ఇక్కడ —'నిండు గానీ, సొంపు గానీ కుదరవు. ఈ అర్ధం లో అనంతామాత్యుని భోజరాజీయంలో ప్రయోగం ఉంది.:
మదనరేఖ తన సత్య వాక్యత నిలుపుకోవాలని భర్త అనుమతి తీసుకొని అర్ధరాత్రి హడావిడిగా పోతూ ఉంటే — ఒక రాక్షసుడు ఆకలి భరించలేక , ఆ అమ్మాయిని తినడానికి వస్తాడు..ఆ పిల్ల ఏమీ భయపడకుండా ..".మాట నిలుపుకొన్న పవిత్ర దేహం ఆహరించు నీకూ మంచిది !" అంటుంది..
పెండ్లి అయిన మొదటి రోజే భర్త అనుమతితో నీ కోరిక తీర్చడానికి వస్తానని ..ముందు తనను ప్రేమించిన... గు రు పుత్రుడి దగ్గర కు (తాను ప్రేమించలేదు.).. బయలుదేరింది....దారిలో ఈ రాక్షసుడు.
పోయి గడియలో వచ్చేస్తాను. తృప్తిగా తిను. .అని అన్నది ఆ రక్కసుడితో.
అపుడు ఆ రాక్షసుడు:—
నావుడు " మేలుమేలబల ! నన్నిట వెర్రుల బెట్టి నెమ్మదిన్ బోవగ జూచెదీవు" ---అంటాడు ( .4- 297ప.)
నెఱ మెచ్చులాడుట- —భోజ -- 4-314 లో మరో ప్రయోగం.
అప్పకవి 2 వ ఆశ్వాసంలో ర— -ఱ ల తేడా చెప్తూ
నెర , నెరసులు,' అనేవి - "నె"తో ఆరంభమయ్యే ర గల పదాలు , అంటూ --- ఱ--- గల పదాలెన్నో చూపాడు.
అందులో :
నెఱి = బాగు,
నెఱసుట = అంతటా విస్తరించుట
నెఱవు = పొడవు ( ఎత్తుగా ఉండడం)
నెఱి = దొడ్డ అని అర్థాలిచ్చాడు.
నెఱ మంట, నెఱ తెవులు , నెఱ బిరుదులు, నెఱ దాతలు,
నెఱ వాదులు, నెఱ వెంట్రుకలు.. మొదలైన రూపాలకు కవి ప్రయోగాలున్నాయి అన్నాడు.
తిక్కన భారతంలో—* నెర, నెరి *—-రూపాలు కో కొల్లలు.
Source : https://te.quora.com/%E0%B0%A8%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%A8%E0%B1%86%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%9F%E0%B1%87
Category:
Telugu
Posted on:
September 13th, 2023