గడియారం ఆసుపత్రి
గడియారం ఆసుపత్రిని కట్టించింది ఇంగ్లీషోడు కాదు మనవాడే. ప్రముఖులు ఎవరైనా వచ్చినప్పుడు వారి గుర్తుగా కొన్ని కట్టడాలు నిర్మిస్తూ ఉంటారు. మద్రాస్ గవర్నర్ ఇ. హ్యావ్ లాక్ 1898 లో కర్నూలును సందర్శించిన సందర్భంగా అప్పటి కర్నూలు ప్రముఖ వ్యాపారవేత్త, దాత, రావు బహదూర్ బిరుదాంకితుడు మేడం సుబ్బన్న శెట్టి ఈ గడియారం ఆసుపత్రిని కర్నూల్ నగరం నడిబొడ్డులో నిర్మించడం జరిగింది. దీని నిర్మాణానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.
1900 సంవత్సరం డిసెంబర్ 19న ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. పై భాగంలో రెండువైపులా పెద్ద గడియారాలు ఉండడంతో దీనికి గడియారం ఆసుపత్రి అని పేరు వచ్చింది. అప్పట్లో కర్నూలు కోటలోనికి రావడానికి నాలుగు ద్వారాలు ఉండేవి. ఒకటి కొండారెడ్డి బురుజు పక్కన ఉండేది. రెండవ ద్వారం చిదంబర రావు వీధిలో, నగరేశ్వర స్వామి గుడి పక్కన తుంగభద్రా నదిలోకి ఉంది. అది చాలా చిన్నది.
కర్నూలును పరిపాలించిన విజయనగర రాజులలో చివరివాడైన గోపాల్ రాజు పేరు మీద దీనిని గోపాల్ దర్వాజా అని పిలుస్తారు. మూడవ ద్వారం పెద్ద మార్కెట్ దాటి తుంగభద్రలోని రాఘవేంద్ర మఠం పోయేటప్పుడు కనపడుతుంది. ఇక నాలుగవది ప్రస్తుతం గడియారం ఆసుపత్రిగా మనం పిలుచుకుంటున్న చోట ఉండేది. ఇది కర్నూల్ రాజ్యాన్ని రెండుగా విడదీసేది. ఈ గడియారం ఆసుపత్రి నుంచి లోపల భాగాన్ని కోట అని, అవతలి భాగాన్ని పేట అని పిలిచేవాళ్ళు. కోటలో రాజులు, ప్రముఖులు, ధనవంతులు, సైన్యాధికారులు నివసిస్తే బయట సాధారణ ప్రజలు ఉండేవారు. వాళ్లు కోటలోనికి రావలసి వస్తే ఈ గడియారం ఆసుపత్రి దగ్గర ఉండే ద్వారం గుండా అనుమతి తీసుకుని రావాలి. 1953లో తీసిన ఫోటో ఒకటి చూడండి. అందులో రాజ వీధి అని మనకు స్పష్టంగా కనబడుతుంది. బ్రిటిష్ వారి పాలనలో కోట పేటలను కలపడం కోసం ఇక్కడ ఉన్న వాకిలి తీసివేయడం జరిగింది. ఆ ద్వారం ఉన్న ప్రాంతంలోనే రెండు ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ ఈ గడియారం ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. ఈ ఆసుపత్రి ముందరే కర్నూలులో మొట్టమొదటి బస్టాండ్ ఉండేది. ఆ తర్వాత అది సిటీ బస్టాండ్ గా మారి బస్టాండ్ కొండారెడ్డి బురుజు వద్దకు చేరింది. ఆ తర్వాత అది కూడా సిటీ బస్టాండ్ గా మారి ఆనంద్ టాకీస్ అవతలికి బస్టాండ్ మారింది. ప్రస్తుతం మనం చూస్తున్న కొత్తబస్టాండ్ మూడవది.
ఒకప్పుడు ఎంతో ప్రసిద్ధి చెంది కర్నూలు ప్రజలకు ఎన్నో సేవలు అందించిన గడియారం ఆసుపత్రి 1950లో కర్నూల్ ప్రభుత్వ వైద్యశాల, 1956లో మెడికల్ కాలేజీ ఏర్పడడంతో తన ప్రాముఖ్యత కోల్పోయి నెమ్మదిగా శిధిలావస్థకు చేరింది. కానీ ఈ చారిత్రిక కట్టడం ప్రాముఖ్యత ఇప్పటి పాలకులు అర్థం చేసుకొని దానికి మరలా పూర్వస్థితి తెచ్చి పెద్దాసుపత్రి వైద్యుల పర్యవేక్షణలోకి తీసుకురావడం సంతోషించదగ్గ విషయం.
Source : https://qr.ae/pFJvwD
Category:
Telugu
Posted on:
September 26th, 2026


