Ground Water Survey

Posted on April 12th, 2023
Share this post:

Ground Water Survey

ప్రభుత్వ పరంగా ఎలా సంప్రదించాలో నాకు సరిగా తెలీదు గానీ మీ ప్రాంతంలో రైతులంతా కలిసి రాష్ట్ర గ్రౌండ్ వాటర్ బోర్డు వారికి ఒక అర్జీ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండవచ్చును. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు గ్రౌండ్ వాటర్ బోర్డు వాళ్ళు వ్యక్తిగత అవసరాల కోసం సర్వే చేయరు. ఒక ఊరికి, ప్రాంతానికి లేదా ఏదైనా ప్రభుత్వ నిర్మాణాల నీటి అవసరాల కోసం చేస్తారు. ఈ విషయం గురించి తెలిసిన వారు నన్ను సవరించవచ్చు.

భూగర్భ జలాలను శాస్త్రీయంగా కనుగొనే పద్ధతి 'రెసిస్టివిటీ సర్వే' లేదా 'జియో ఎలెక్ట్రిక్ సర్వే'. ఈ సర్వే ద్వారా ఎంచుకున్న ప్రాంతంలో ఒక పద్ధతి ప్రకారం భూమిలోపలకి విద్యుత్ పంపించి ఓల్టేజీ నమోదు చేసారు. దీని నుండి భూమి లోపల ఉన్న పొరల యొక్క విశిష్ట నిరోధం (Resistivity) లెక్కకడతారు. ఆధునిక పద్ధతుల్లో Electrical Resisitivity Tomography (ERT) ప్రాచుర్యం పొందింది.

ఈ 'రెసిస్టివిటీ మెథడ్' ప్రయోజనం ఏంటంటే రాయిలో నిండిన వివిధ రకాలైన ద్రవాలకు వివిధ రకాలుగా రెసిస్టివిటీ విలువను చూపిస్తుంది. ఉదాహరణకు ఒకే రకమైన ఇసుక రాయిలోనే పొడిగా ఉన్నప్పుడు ఒక విలువ, మంచి నీటితో నిండినపుడు ఒక విలువ, ఉప్పు నీటితో నిండినపుడు ఒక విలువ ఉంటుంది, చమురుతో నిండినపుడు ఒక విలువ ఇలా వ్యత్యాసం ఉంటుంది.

ఈ వ్యత్యాసంతో మంచి నీరు ఎక్కడ ఉంది, నీరు నిల్వ అయ్యే aquifer నిర్మాణం ఎలా ఉంది? ఎంత లోతులో ఎలాంటి రాళ్ళు ఉన్నాయి, వాటిలో ఎలాంటి ద్రవాలు నిండి ఉన్నాయి? ఇలాంటి విషయాలను రెసిస్టివిటీ మ్యాపు ద్వారా తెలుసుకోవచ్చు. భూగర్భ జలాల గతిని తెలుసుకోవచ్చు.

అయితే ప్రతీ పొలంలో నీరు ఖచ్చితంగా ఉండాలి అనేది మన చేతిలో లేని విషయం, అదృష్టంతో కూడుకున్నది కాబట్టి ఖచ్చితంగా మీకు గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు. సర్వే వైశాల్యం ఎక్కువ అయితే కనుక నీరు పడే సంభావ్యత ఎక్కువ ఉంటుంది.

డౌసింగ్, L - రాడ్స్, అర చేతిలో కొబ్బరికాయ పద్ధతులు ఏవీ శాస్త్రీయమైనవి కాదు. మీరు వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ప్రభుత్వపరంగా కాకపోయినా లైసెన్స్డ్ జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్ లేదా అనుభవం ఉన్న రెసిస్టివిటీ సర్వే చేసే కంపెనీలను సంప్రదించవచ్చు.


Ground Water Survey
 

Category:
Telugu

Posted on:
April 12th, 2023